కండక్టర్ ప్రవళిక కుటుంబానికి రేవంత్ సర్కార్ అండ.. ఉద్యోగం, ఇల్లు, రూ.1.10 కోట్ల పరిహారం!
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ ఆర్టీసీ మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. చిన్న వయసులోనే ఆమె మృతి చెందడంతో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రవళిక కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఆమె తల్లికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ తరఫున కలిపి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా అందించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం ప్రకారం బ్యాంకు ద్వారా రూ.కోటి ప్రమాద బీమా కూడా కుటుంబానికి అందనుంది.
హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వద్ద ప్రవళిక పార్థివదేహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. అనంతరం ఆమె తల్లిని పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ప్రవళిక కుటుంబానికి ఆర్టీసీ కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తన కుమార్తెను విగతజీవిగా చూసిన తల్లి మంత్రిని పట్టుకుని కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడున్న వారిని కలచివేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కుటుంబానికి ఆర్థిక సహాయంతో పాటు ఉద్యోగం, ఇల్లు కల్పించే నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొన్నం వివరించారు. మరోవైపు ప్రవళిక కుటుంబ సభ్యులు ఆమె కళ్లను దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.