HYD ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ఫ్రీ లెఫ్ట్‌లు, కొత్త లైన్లతో సహా 72 జంక్షన్ల అభివృద్ధి

RVIRVI
14 Nov, 26
 0  24
HYD ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ఫ్రీ లెఫ్ట్‌లు, కొత్త లైన్లతో సహా 72 జంక్షన్ల అభివృద్ధి

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో నిత్యం వేధిస్తున్నట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేందుకు సైబరాబాద్ నగరపాలక సంస్థ ( CMC ) ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే కూడళ్లను గుర్తించి వాటిని శాస్త్రీయ పద్ధతిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి విడతలో ఎనిమిది ప్రధాన కూడళ్లను అభివృద్ధి చేయనుంది. ఫ్రీ లెఫ్ట్ మార్గాల ఏర్పాటు, లేన్ మార్కింగ్, ట్రాఫిక్ సిగ్నళ్లు, సూచిక బోర్డులు, రోడ్ల విస్తరణ వంటి పనులు చేపట్టనున్నారు. కమిషనర్ జి.సృజన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించడంతో ఇంజినీరింగ్ విభాగం కార్యాచరణ ప్రారంభించింది. తొలి విడత పనులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.



ఐటీ కారిడార్‌లో రహదారుల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం జరిగినప్పటికీ కొన్ని ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ సమస్య తగ్గడం లేదు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోతున్నాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ కూడళ్ల రూపకల్పనలో మార్పులు తీసుకురావాలని సీఎంసీ నిర్ణయించింది. వాహనాలు ఒకదానికొకటి అడ్డుపడకుండా ప్రత్యేక లేన్లు, ఫ్రీ లెఫ్ట్ మార్గాలు ఏర్పాటు చేయడంతోపాటు కూడళ్ల వద్ద బస్సులు, ఆటోలు నిలిపి ప్రయాణికులను ఎక్కించుకోవడాన్ని నియంత్రించనున్నారు.

గచ్చిబౌలి చౌరస్తా అభివృద్ధిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నగరంలోనే అత్యంత రద్దీగా ఉండే కూడళ్లలో ఇది ఒకటి. రోడ్ల విస్తరణ, పైవంతెనల నిర్మాణం జరిగినా ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కొనసాగుతున్నాయి. దీంతో కూడలిని శాస్త్రీయంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. అన్ని వైపులా ప్రధాన రహదారులను డివైడర్లతో వేరు చేయడంతోపాటు ఫ్రీ లెఫ్ట్ మార్గాలను అభివృద్ధి చేయనున్నారు. వాహనదారులకు దిశానిర్దేశం చేసే సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తారు. కూడళ్ల వద్ద బస్సులు, ఆటోలు ఆగకుండా చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం ఈ పనులు టెండర్ల దశలో ఉన్నాయి.