'దిల్లీ మార్చ్'కు రాహుల్ పిలుపు- అనుమతి లేదన్న పోలీసులు- దేశ రాజధానిలో రాజకీయ వేడి!
నవంబర్ 1న దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఇండి కూటమి తలపెట్టనున్న భారీ ర్యాలీలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలు, పౌరులు, యువకులు అధిక సంఖ్యలో తరలిరావాలని అన్నారు. శనివారం తన 'ఎక్స్' ఖాతాలో ర్యాలీకి సంబంధించిన వివరాలను ప్రకటించారు. ఆదివారం మధ్యాహ్నం 12గంటలకు మింటో రోడ్- కన్నాట్ ప్లేస్ జంక్షన్ నుంచి ప్రారంభమయ్యే మార్చ్, రామ్‌లీలా మైదానం వరకు సాగుతుందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్నికల కమిషన్ కలిసి భారత ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్న తీరుపైనే ఈ నిరసన చేపడుతున్నట్లు రాహుల్ పేర్కొన్నారు. ర్యాలీలో పాల్గొనేందుకు ప్రజలు దిల్లీకి రాకుండా అడ్డుకునేందుకు అమిత్ షా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
మరోవైపు, రాహుల్‌గాంధీ పోస్టుపై స్పందించిన దిల్లీ పోలీసులు, కన్నాట్ ప్లేస్ నుంచి మార్చ్ ప్రారంభించడానికి ఎటువంటి దరఖాస్తు అందలేదని పేర్కొన్నారు. అదే సమయంలో ఎంపీలు, రాజకీయ నాయకులు తమ ప్రైవేట్ వాహనాల్లో కాన్స్టిట్యూషన్ క్లబ్‌కు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. అలాగే, గతంలో నిరసనలకు వేదికైన జంతర్ మంతర్ ఎలాంటి కార్యక్రమాలు తలపెట్టరాదని ఇదివరకే ప్రకటించారు.