జగిత్యాల చిన్నారి దత్తత కేసులో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై కలెక్టర్ పిటిషన్

RVIRVI
04 Nov, 26
 0  23
జగిత్యాల చిన్నారి దత్తత కేసులో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై కలెక్టర్ పిటిషన్

తెలంగాణవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన జగిత్యాల చిన్నారి దత్తత వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. శిశు సంక్షేమ కేంద్రంలో ఉంటూ ‘అమ్మా.. నన్ను తీసుకెళ్లు.. భయమేస్తోంది’ అంటూ బాలుడు రోదించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు చిన్నారిని పెంపుడు తల్లిదండ్రులకు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వివాదం ఇంతటితో ముగిసిపోలేదు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించాలని హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తాజాగా మరోసారి హైకోర్టును ఆశ్రయించడంతో ఈ వివాదం మళ్లీ మొదటికి వచ్చింది.

చిన్నారిని పెంపుడు తల్లిదండ్రులకు అప్పగిస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ సత్యప్రసాద్ తన రిట్ పిటిషన్‌లో కోరారు. అంతేకాకుండా బాలుడిని తిరిగి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) సంరక్షణలోకి పంపాలని విజ్ఞప్తి చేశారు. సీడబ్ల్యూసీ నిబంధనలు, అధికారులు సమర్పించిన ఆధారాలను పూర్తిస్థాయిలో పరిశీలించకుండానే కోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం దత్తత తీసుకున్నంత మాత్రాన అది చట్టబద్ధమైన దత్తత ప్రక్రియగా పరిగణించవచ్చా లేదా అనే అంశాన్ని పరిశీలించాలని కలెక్టర్ కోర్టును కోరారు.