హైదరాబాద్‌లో వీధిలైట్ల సమస్యకు చెక్.. పదేళ్ల నిర్వహణకు రూ.1,720 కోట్లతో ప్రభుత్వ ఉత్తర్వులు
గ్రేటర్ హైదరాబాద్ నగరవాసులు రెండేళ్లుగా ఎదుర్కొంటున్న వీధిలైట్ల సమస్యకు పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మూడు నగరపాలక సంస్థల్లో వీధి దీపాల నిర్వహణకు పదేళ్ల కాలపరిమితితో రూ.1,720.83 కోట్ల ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీధిలైట్ల నిర్వహణ, మరమ్మతులు, ఫిర్యాదుల పరిష్కారాన్ని ఒకే సంస్థకు అప్పగించడం ద్వారా రహదారులపై వెలుతురు సమస్యను నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తే నగరంలోని సుమారు 7.6 లక్షల వీధిలైట్ల నిర్వహణ వ్యవస్థలో మార్పులు రానున్నాయి.
వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం 2026 మార్చి 6న రూ.1,341.60 కోట్లతో అనుమతి ఇచ్చింది. అయితే టెండర్ల ప్రక్రియలో పాల్గొన్న సంస్థలు ప్రభుత్వ అంచనా వ్యయం కంటే అధిక మొత్తాలను కోట్ చేశాయి. బీఏసీ ఇన్‌ఫ్రాటెక్–విన్సీ గ్లోబల్ జాయింట్ వెంచర్ ఒక్కో లైటు నిర్వహణకు నెలకు రూ.153.60 ధరను ప్రతిపాదించింది. ఇది నిర్ణయించిన బెంచ్‌మార్క్ ధర కంటే 4.49 శాతం అధికం. మరో సంస్థ బజాజ్ ఎలక్ట్రానిక్స్–మ్యాట్రిక్స్ మీటర్స్ కన్సార్టియం రూ.153.90 కోట్ చేసింది. ఇది బెంచ్‌మార్క్ కంటే 4.69 శాతం ఎక్కువ. ఈ రెండు ప్రతిపాదనల్లో తక్కువ ధరను కోట్ చేసిన బీఏసీ ఇన్‌ఫ్రాటెక్–విన్సీ గ్లోబల్ జాయింట్ వెంచర్‌కు పనులు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెరిగిన టెండరు విలువకు అనుగుణంగా మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.1,720.83 కోట్లకు సవరించి పరిపాలన అనుమతులు ఇచ్చింది.
టెండరు నిబంధనల ప్రకారం నవంబరు నెలాఖరులోగా ఒప్పందాలు, ఇతర ప్రక్రియలను పూర్తి చేయనున్నారు. డిసెంబరు నుంచి ఎంపికైన గుత్తేదారు సంస్థ వీధిలైట్ల నిర్వహణ బాధ్యతలు చేపట్టనుంది. తొలుత మూడు కార్పొరేషన్లకు వేర్వేరుగా డ్యాష్‌బోర్డులను రూపొందిస్తారు. మొదటి మూడు నెలల్లో ఈ వ్యవస్థను సిద్ధం చేయనున్నారు. అనంతరం ఆరు నెలల్లో మూడు కార్పొరేషన్ల పరిధిలోని అన్ని వీధిలైట్లను కంట్రోల్ యూనిట్లకు అనుసంధానించి డ్యాష్‌బోర్డుతో లింక్ చేస్తారు. ఈ ప్రాజెక్టులో రోజువారీగా కనీసం 98 శాతం వీధిలైట్లు వెలగాలనే నిబంధన విధించారు. కార్పొరేషన్ల వారీగా పనిచేస్తున్న లైట్ల శాతాన్ని లెక్కించిన తర్వాతే గుత్తేదారు సంస్థకు బిల్లులు చెల్లిస్తారు. అంటే నిర్ణీత లక్ష్యం మేరకు వీధిలైట్లు పనిచేయకపోతే చెల్లింపులపై ప్రభావం పడనుంది. గుత్తేదారు పనితీరును స్వతంత్రంగా అంచనా వేసేందుకు మూడో సంస్థను నియమించనున్నారు. ఈ బాధ్యతను ప్రభుత్వం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అప్పగించింది. డిసెంబరు నుంచి వెలగని లైట్ల మరమ్మతులు, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం గుత్తేదారు సంస్థ బాధ్యతగా ఉండనుంది.వీధుల్లో వెలుతురు తీవ్రతను పెంచేందుకు పాత బల్బుల స్థానంలో ఎక్కువ వాటేజీ ఉన్న లైట్లను ఏర్పాటు చేయనున్నారు. గతంలో 18 వాట్ల బల్బులు ఉన్నచోట 25 వాట్ల లైట్లు, 35 వాట్ల స్థానంలో 40 వాట్ల లైట్లు అమర్చనున్నారు. 70 వాట్ల లైట్లకు బదులుగా 65 నుంచి 90 వాట్ల సామర్థ్యం కలిగిన లైట్లను, 110 వాట్ల స్థానంలో 90 నుంచి 120 వాట్ల లైట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ వివరాలను జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. కొత్త నిర్వహణ విధానంతో వీధిలైట్ల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు. పదేళ్లపాటు కొనసాగే ఈ ప్రాజెక్టు ద్వారా క్యూర్ పరిధిలోని మూడు కార్పొరేషన్లలో రాత్రివేళల్లో వెలుతురు సమస్యలను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.