హైదరాబాద్‌లో కల్తీ పాల దందా.. హైడ్రోజన్ పెరాక్సైడ్‌, పాలపొడి కలిపి తయారీ.. 100 లీటర్లు సీజ్

RVIRVI
06 Nov, 26
 0  38
హైదరాబాద్‌లో కల్తీ పాల దందా.. హైడ్రోజన్ పెరాక్సైడ్‌, పాలపొడి కలిపి తయారీ.. 100 లీటర్లు సీజ్

హైదరాబాద్‌లో కల్తీ పాల తయారీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ పాలల్లో ప్రమాదకర రసాయనాలు కలిపి విక్రయిస్తున్న వ్యవహారాన్ని పోలీసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామంలో నిర్వహిస్తున్న కల్తీ పాల తయారీ కేంద్రంపై మహేశ్వరం జోన్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్ఓటీ) పోలీసులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హైడ్రోజన్ పెరాక్సైడ్, పాలపొడి కలిపి పాలు తయారు చేస్తున్నట్లు వెల్లడైంది. అక్కడి నుంచి 100 లీటర్ల అనుమానిత కల్తీ పాలు, రసాయనాలు, పాలపొడి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పోచారం గ్రామానికి చెందిన అందె శ్రీశైలం (43) పాల వ్యాపారం నిర్వహిస్తున్నాడు.

అయితే అతడు పాలల్లో హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో పాటు ధోల్‌పూర్ బ్రాండ్ పాలపొడిని కలిపి కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలా తయారుచేసిన పాలను హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. శుక్రవారం ఈ కల్తీ పాల తయారీ కేంద్రంపై మహేశ్వరం జోన్ ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా శ్రీశైలంను అదుపులోకి తీసుకున్నారు. పాల తయారీలో ఉపయోగిస్తున్న పదార్థాలను పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు.