'పాలేరు' రైతుల పంట పండింది - వరితో ఎకరాకు రూ.లక్ష సంపాదిస్తున్నారు
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా కరవు తాండవిస్తోంది. చిన్న కుంటలతో మొదలై పెద్ద పెద్ద రిజర్వాయర్లలోనూ నీరు అడుగంటిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కానీ ఈ కరవులోనూ పాలేరు రిజర్వాయర్ బ్యాక్ వాటర్‌తో వరి సాగు చేసిన కొందరు రైతుల పంట పండింది. మోతె మండలంలో పాలేరుకు సంబంధించిన వాగు పక్కన ఉన్న పది గ్రామాల రైతులు ఎకరాకు తక్కువలో తక్కువ రూ.లక్ష దాకా ఆదాయాన్ని గడిస్తున్నారు.
ప్రస్తుతం ఇక్కడ వరి పొలాలు గడ్డు కాలాన్ని దాటుకుని బయటపడ్డాయి. సుమారు ఐదు వేల ఎకరాల్లో సన్న రకం వరిని సాగు చేసిన పొలాలు నూర్పిడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. పొలాల వద్దకు వచ్చి ప్రస్తుతం పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అధిక ధరలు చెల్లిస్తున్నారు వ్యాపారులు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఆసక్తి కనబరుస్తుండటంతో ఈసారి రికార్డు ధరలు నమోదవుతున్నాయి.
పక్క రాష్ట్రాల నుంచి వ్యాపారులు
ప్రస్తుతం కేఎన్ఎమ్ 1638, బీపీటీ, చింట్లు రకాల వడ్లను నూర్పిడి చేస్తున్నారు. ఇంకా సాంబమసూరి రావడానికి కొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో సన్నాలకు అధికంగా డిమాండ్ ఉండటంతో పొలాల వద్దకు పక్క రాష్ట్రాల నుంచి వ్యాపారులు వచ్చి రైతుకు ఎటువంటి ఖర్చు లేకుండా తూకం వేసి అక్కడే నగదు చెల్లించి తీసుకెళ్తున్నారని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.