బీజేపీలోకి తలసాని, ఖైరతాబాద్ నుంచి కుమారుడు పోటీ అంటూ ప్రచారం.. రాజాసింగ్ రియాక్షన్ ఏంటంటే?
ఖైరతాబాద్‌లో ఎప్పుడైనా ఉప-ఎన్నిక వచ్చే అవకాశం ఉందని, బీజేపీకి విజయావకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేయడంతో ఉప-ఎన్నిక అనివార్యమైంది. బీజేపీలో ఇప్పటికే మంచి నాయకులు ఉన్నారని పాత మోడల్, కొత్త మోడల్ అభ్యర్థులు చాలా మంది ఉన్నారని రాజా సింగ్ చెప్పారు. సొంత అభ్యర్థులే ఉండగా వేరే పార్టీ నుంచి అభ్యర్థిని తీసుకునే అవసరం లేదన్నారు.
ఈసారి ఖైరతాబాద్ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని, వారిలో బీజేపీని గెలిపించాలనే ఉద్దేశం బలంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో గెలవాలని అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, బీజేపీలు పట్టుదలగా ఉన్నాయని అన్నారు. దానం నాగేందర్‌కు అవకాశం ఇచ్చామని, ఆయన చేసిన తప్పుల వల్ల ఉప-ఎన్నిక వచ్చిందని అందుకే బీజేపీకి ఓటేస్తామని ఓటర్లు భావిస్తున్నారని గోషా మహల్ ఎమ్మెల్యే జోస్యం చెప్పారు. అభ్యర్థి ఎవరు అనేది తర్వాత తెలుస్తుంది కానీ, ఖైరతాబాద్ ప్రజలు మాత్రం 100 శాతం కమలంవైపు మొగ్గుచూపుతున్నారని అన్నారు.
‘‘బీఆర్ఎస్ పార్టీ కూడా తలసాని కొడుకును నిలబెట్టాలా లేక మరొకరిని పెట్టాలా అనే దానిపై ప్రయత్నాలు చేస్తోంది... ఈ ఎన్నిక తర్వాత గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి.. కాబట్టి అన్ని పార్టీలకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక చాలా కీలకం.. ఈ ఫలితమే తర్వాత జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రభావం చూపుతుంది.. కానీ, ఖచ్చితంగా ఖైరతాబాద్‌లో బీజేపీ జెండా ఎగురుతుందని మాకు నమ్మకం ఉంది.. ఈసారి ఓటర్లు బీజేపీని గెలిపిస్తారు’’ అని రాజా సింగ్ పేర్కొన్నారు.