అర్హులైన నిరుపేదలందరికీ చేయూత పింఛన్లు: మంత్రి పొంగులేటి
నేలకొండపల్లి గ్రామీణం: దీపావళి కానుకగా రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకం కింద 4.50 లక్షల పింఛన్లను అర్హులైన నిరుపేదలకు మంజూరు చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నేలకొండపల్లిలో ఏర్పాటు చేసిన పింఛన్ల పంపిణీలో మంత్రి పాల్గొని మాట్లాడారు. అంతకుముందు అర్హులైన 1138 మందికి మంత్రి పింఛన్లు పంపిణీ చేశారు. అదేవిధంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని మంత్రి పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తోందని మంత్రి పొంగులేటి తెలిపారు. అనంతరం కొత్తగా పింఛన్ తీసుకుంటున్న లబ్ధిదారులతో మంత్రి స్వయంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీజ, డీఆర్డీవో కొండపల్లి శ్రీరామ్, తదితరులు పాల్గొన్నారు.