తెలంగాణలో 21 మంది ఐపీఎస్‌ల బదిలీలు.. ఫైర్ డీజీగా సజ్జనార్, హైదరాబాద్ సీపీగా మహేశ్ భగవత్
తెలంగాణ పోలీసు శాఖలో భారీ ప్రక్షాళన జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు నవంబర్ 12వ తేదీన జారీ చేసిన జీవో నంబర్ 1654 ప్రకారం 21 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ఉత్తర్వులు వెలువరించారు. ఇప్పటివరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన వీసీ సజ్జనార్‌ను తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్‌గా (డీజీ) నియమించడంతో పాటు ఎస్పీఎఫ్ (SPF) డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన స్థానంలో లా అండ్ ఆర్డర్ డీజీపీగా ఉన్న మహేశ్ భగవత్‌ను హైదరాబాద్ కొత్త సీపీగా నియమించారు.
చారు సిన్హాను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీపీగా నియమించి.. అదనంగా సీఐడీ డీజీగా బాధ్యతలు ఇచ్చారు. జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రాను ఉమెన్ సేఫ్టీ, షీ టీమ్స్, భరోసా డీజీపీగా బదిలీ చేసి.. ఆర్గనైజేషన్, లీగల్ విభాగాల అదనపు బాధ్యతలు అప్పగించారు. స్వాతి లక్రాను జైళ్ల శాఖ డీజీపీగా నియమించారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ డీజీపీ అనిల్ కుమార్‌ను.. టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) ఎండీగా బదిలీ చేశారు. పౌరసరఫరాల కమిషనర్‌గా వై. నాగిరెడ్డిని నియమించారు.
గ్రేహౌండ్స్, ఆక్టోపస్ డీజీగా విక్రమ్ సింగ్ మాన్, అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్)గా అకున్ సబర్వాల్ .. తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో (TG-TMARS) డైరెక్టర్‌గా ఎం. స్టీఫెన్ రవీంద్ర నియామకం జరిగింది. ఏసీబీ డైరెక్టర్‌గా ఎస్. చంద్రశేఖర్ రెడ్డి.. మల్టీ జోన్-1 ఐజీగా కార్తికేయ.. హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ అండ్ TG-TMARS జాయింట్ డైరెక్టర్‌గా డి. జోయల్ డేవిస్, ఫ్యూచర్ సిటీ జాయింట్ సీపీ జి. చందన దీప్తికి జోగులాంబ జోన్-7 డీఐజీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.