ఫ్రీగా వెండి నాణేల పంపిణీ.. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి పోటెత్తిన భక్తులు, ఈనెల 11 వరకే..!

RVIRVI
09 Nov, 26
 0  44
ఫ్రీగా వెండి నాణేల పంపిణీ.. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి పోటెత్తిన భక్తులు, ఈనెల 11 వరకే..!

దీపావళి పండుగ వేళ హైదరాబాద్‌ చార్మినార్‌ వద్ద కొలువైన భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. అమ్మవారి ఖజానా పేరుతో ఉచితంగా వెండి నాణేలను పంపిణీ చేస్తుండటంతో నగరంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆదివారం సాయంత్రం ప్రారంభమైన ఈ పంపిణీ కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అమ్మవారి వెండి నాణెం ఇంటికి తీసుకెళ్తే శుభాలు కలుగుతాయని.. సిరిసంపదలు వృద్ధి చెందుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 7 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఖజానా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

నాణేలను స్వీకరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. గుల్జార్ హౌస్ నుంచి సుమారు 500 మీటర్ల వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ కమిటీ నాలుగు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాణేల పంపిణీ జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు కమిటీ వెల్లడించింది. దీపావళి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మూడు రోజుల పాటు అమ్మవారి ఖజానా పంపిణీ కొనసాగనుంది. ఈ నెల 11వ తేదీ వరకు భక్తులకు వెండి నాణేలు అందించనున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. నిర్ణీత గడువులోగా నాణెం పొందేందుకు భక్తులు ఆలయానికి వస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు ఖజానా నాణేలను స్వీకరిస్తున్నారు.



భక్తుల రద్దీ కారణంగా చార్మినార్‌, గుల్జార్ హౌస్ పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అవసరమైన చోట ట్రాఫిక్ ఆంక్షలు విధించి వాహనాలను మళ్లిస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు, స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. దీపావళి వేళ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో వెండి నాణేల పంపిణీ కార్యక్రమం భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అమ్మవారి ఆశీస్సులు పొందాలనే ఆకాంక్షతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో చార్మినార్ పరిసరాలు ఆధ్యాత్మిక సందడిని సంతరించుకున్నాయి.

అయితే ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి సంబంధించి ఒక ముఖ్యమైన చరిత్ర ఉంది. చార్మినార్ వద్ద కాపలాగా ఉన్న సైన్యానికి లక్ష్మీదేవి దర్శనమిచ్చినట్లు చెబుతారు. అయితే ఆమెను లోపలికి అనుమతించేందుకు రాజు అనుమతి కోసం సైనికులు వెళ్లగా.. వారి తిరిగి వచ్చే వరకు అక్కడే వేచి చూస్తానని అమ్మవారు మాట ఇచ్చారు. అమ్మవారిని వెనక్కి పంపించకుండా రాజు సైనికులను ఆపేయడంతో అమ్మవారు అక్కడే కొలువుదీరినట్లు ఆ కథ ప్రచారంలో ఉంది. ఇక ప్రతీ సంవత్సరం అమ్మవారికి కానుకల రూపంలో వచ్చిన వెండిని కరిగించి.. ఒక నాణెంలాగా తయారు చేసి.. ధనత్రయోదశి మరుసటి రోజు నుంచి భక్తులకు పంపిణీ చేస్తూ ఉంటారు.