HCUలో ఫుడ్ పాయిజన్ కలకలం.. 30 మందికిపైగా విద్యార్థులకు అస్వస్థత, ఆస్పత్రుల్లో చికిత్స
హైదరాబాద్ గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ జరిగినట్లు వార్తలు రావడం తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. హాస్టళ్లలో భోజనం చేసిన పలువురు విద్యార్థులకు అస్వస్థత బారిన పడటం తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) పరిధిలోని మెన్స్ హాస్టల్-ఎం, ఎం అనెక్సీ, ఎన్‌ఆర్‌ఎస్ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనల్లో 30 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వారిలో కొందరిని యూనివర్సిటీ హెల్త్ సెంటర్‌లో.. మరికొందరిని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం వెలుగులోకి రావడం గమనార్హం.
అయితే యూనివర్సిటీ హాస్టల్ మెస్‌లలో నెలకొన్న సమస్యలతోపాటు.. విద్యార్థులకు పెడుతున్న నాసిరకం ఆహారంపై విద్యార్థి సంఘం ప్రతినిధులు యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. హాస్టళ్లలో ఎమర్జెన్సీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. యూనివర్సిటీలో 30 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురైనప్పటికీ వైస్ ఛాన్స్‌లర్, రిజిస్ట్రార్ స్పందించకపోవడంపై విద్యార్థి సంఘం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఫుడ్ పాయిజన్ ఘటనతో ఆస్పత్రి పాలైన విద్యార్థులకు పరీక్షల షెడ్యూల్ నుంచి కొంత సడలింపు ఇవ్వాలని కోరారు.