సిరిసిల్ల రైతు అద్భుతం.. ఫోన్లో ఒక్క క్లిక్‌తో 45 ఎకరాలకు నీళ్లు, ఎలా పని చేస్తుందంటే..?
వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటే సాగు పనులను ఎంత సులభతరం చేసుకోవచ్చో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ రైతు నిరూపిస్తున్నారు. కూలీల కొరత, పెరుగుతున్న సాగు ఖర్చులు, నీటి నిర్వహణ సమస్యలకు సాంకేతికతతో పరిష్కారం చూపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది గ్రామానికి చెందిన లగిశెట్టి శ్రీనివాస్ తన 45 ఎకరాల ఆయిల్‌పామ్ తోటకు సెల్‌ఫోన్‌లోని యాప్ ద్వారా సాగునీటిని అందిస్తున్నారు. తోటలో ఎక్కడి నుంచైనా మోటార్లను ఆన్, ఆఫ్ చేయడంతోపాటు నీటి సరఫరా సమయాన్ని కూడా ముందుగానే నిర్ణయించుకునే సదుపాయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకోసం సుమారు ఏడాది క్రితం రూ.10 లక్షలు వెచ్చించి ఆటోమేషన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు.
కొన్నేళ్ల క్రితం ప్రభుత్వ ప్రోత్సాహంతో శ్రీనివాస్ తనకున్న 45 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు ప్రారంభించారు. రాయితీపై మొక్కలు, బిందుసేద్యం పరికరాలను పొందారు. తోట మొత్తానికి నీరందించేందుకు మూడు ప్రాంతాల్లో బోరుబావులు తవ్వించి డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే ఇంత పెద్ద విస్తీర్ణంలో ఉన్న మొక్కలకు క్రమం తప్పకుండా నీటిని అందించడం సవాలుగా మారింది. ఇందుకోసం ఎక్కువ మంది కూలీలు అవసరమయ్యేవారు. సరైన సమయంలో నీరు అందక కొన్ని సందర్భాల్లో మొక్కలు ఎండిపోయేవి. ఈ సమస్యలను అధిగమించేందుకు సంప్రదాయ సాగు విధానానికి సాంకేతికతను జోడించారు.
మొత్తం తోటను మూడు విభాగాలుగా విభజించి, ప్రతి విభాగంలోని నీటి సరఫరా వాల్వులకు సెన్సర్లతో కూడిన ప్రత్యేక పరికరాలను అమర్చారు. వాటిని నిర్వహించేందుకు సోలార్ ప్యానెళ్లతో పనిచేసే డివైజ్‌లను ఏర్పాటు చేశారు. ఈ మూడు వ్యవస్థలను ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) పరికరం ద్వారా అనుసంధానించారు. ఇందులో ఏర్పాటు చేసిన సిమ్ కార్డు సహాయంతో మొబైల్ ఫోన్‌కు సంకేతాలు అందుతాయి. తన స్మార్ట్‌ఫోన్‌లోని ఆటో ఫామ్ యాప్ ద్వారా ఒక్క క్లిక్‌తో మోటార్లను ఆన్, ఆఫ్ చేయవచ్చు. అంతేకాకుండా ఏ ప్రాంతానికి ఎప్పుడు, ఎంతసేపు నీరు అందించాలనే విషయాన్ని ముందుగానే షెడ్యూల్ చేసుకునే సదుపాయం ఉంది.ఈ వ్యవస్థలో మరో ప్రత్యేకత ఏమిటంటే మోటార్లకు డ్రైరన్ రక్షణ సదుపాయం కల్పించడం. బోరుబావుల్లో నీరు లేని సమయంలో మోటార్లు పనిచేస్తూ కాలిపోకుండా సెన్సర్లు గుర్తించి ఆటోమేటిక్‌గా వాటిని నిలిపివేస్తాయి. తోటకు అవసరమైన నీటిని అందించిన తర్వాత మిగిలిన నీటిని వృథా చేయకుండా వ్యవసాయ క్షేత్రంలోని బావిలో నిల్వ చేస్తున్నారు. సోలార్ ప్యానెళ్ల వినియోగంతో నిర్వహణలో విద్యుత్‌పై ఆధారపడటాన్ని కూడా తగ్గించే అవకాశం ఏర్పడింది.
ఈ ఆటోమేషన్ విధానం వల్ల కూలీల అవసరం, శ్రమ, సమయం గణనీయంగా తగ్గాయని శ్రీనివాస్ చెబుతున్నారు. మొక్కలకు అవసరమైన సమయంలో నీరు అందుతుండటంతో సాగు నిర్వహణ మరింత సులభమైందని వివరిస్తున్నారు. నీటి వినియోగాన్ని క్రమబద్ధీకరించడం, మిగులు నీటిని నిల్వ చేయడం వంటి ప్రయోజనాలు కూడా లభిస్తున్నాయి. సంప్రదాయ వ్యవసాయానికి ఆధునిక సాంకేతికతను జోడిస్తే తక్కువ శ్రమతో ఎక్కువ విస్తీర్ణంలో సాగు నిర్వహించవచ్చని ఈ రైతు ప్రయోగం నిరూపిస్తోంది. ఇతర రైతులకు కూడా ఈ విధానం స్ఫూర్తిగా నిలుస్తోంది.