చేవెళ్లలో పల్టీలు కొట్టిన ఆర్మీ జవాన్ల వాహనం.. 14 మందికి గాయాలు.. 8 మంది పరిస్థితి తీవ్ర విషమం
సైనికులు వెళ్తున్న వాహనం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న కారును తప్పించే క్రమంలో ఆర్మీ వాహనం అదుపుతప్పగా.. రోడ్డుపై పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న 14 మంది ఆర్మీ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చేవెళ్ల మండలం అల్లావాడ గేట్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆర్మీ శిక్షణలో భాగంగా గోల్కొండ ఆర్మీ క్యాంపు నుంచి 14 మంది జవాన్లు వాహనంలో షాబాద్ వైపు బయలుదేరారు. ఈ క్రమంలో చేవెళ్ల మండలం అల్లావాడ గేట్ సమీపానికి చేరుకోగానే ఎదురుగా వస్తున్న కారును తప్పించే ప్రయత్నంలో వాహనం అదుపుతప్పినట్లు ప్రాథమిక సమాచారం.
దీంతో ఆర్మీ వాహనం పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొని ఆగిపోయింది. ఆ సమయంలో వాహనాన్ని డ్రైవింగ్ శిక్షణలో ఉన్న హవల్దార్ అవిందర్ నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ శిక్షణలో ఉన్న హవల్దార్ అవిందర్తో పాటు మరో 13 మంది జవాన్లు గాయపడ్డారు. వీరిలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్‌లలో ఆసుపత్రులకు తరలించారు.