ఉన్నత విద్య, కోట్ల వ్యాపారం వదిలి ఆధ్యాత్మిక బాటలోకి.. 25 ఏళ్లకే జైన సాధ్విగా సంజన!
ఆ యువతి చిన్న వయసులోనే ఉన్నత చదువులు పూర్తి చేసింది.. వ్యాపార రంగంలో అడుగుపెట్టి విజయవంతమైన పారిశ్రామికవేత్తగా గుర్తింపు తెచ్చుకుంది. ఫ్యాషన్ డిజైనర్‌గా, బొటిక్ ఓనర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. కోట్ల రూపాయల ఆస్తులు, విలాసవంతమైన జీవితం అందుబాటులో ఉన్నప్పటికీ అవేవీ తనకు ఆత్మసంతృప్తిని ఇవ్వలేకపోయాయని భావించింది. చివరకు ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని నిర్ణయించుకుంది. మహారాష్ట్రకు చెందిన 25 ఏళ్ల సంజనా జీ లూనావత్ ఇప్పుడు జైన సాధ్విగా మారేందుకు సిద్ధమై అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఆ యువతి తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆలోచనల్లోకి మళ్లించింది.
మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా భడ్‌గావ్‌కు చెందిన సంజనా జీ లూనావత్.. చిన్నప్పటి నుంచే జైన కుటుంబ వాతావరణంలో పెరిగింది. ఆమె తండ్రి కవర్‌లాల్ ఆటోమొబైల్ వ్యాపారంలో ఉండగా.. సోదరుడు శుభం కూడా సొంత వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ముంబైలో ఎంబీఏ పూర్తి చేసిన సంజన.. ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే ఒక బొటిక్‌ను ఏర్పాటు చేసి.. తన వ్యాపారాన్ని విజయవంతంగా నడుపుతూ ఆర్థికంగా స్థిరపడింది.
అయితే.. సంజన ఆలోచనలు క్రమంగా ఆధ్యాత్మికత వైపు మళ్లాయి. తనకు 12 ఏళ్ల వయసు నుంచే జైన తత్వశాస్త్రం, మత బోధనలపై ఆసక్తి ఏర్పడిందని సంజనా వెల్లడించింది. ఏళ్లు గడిచేకొద్దీ ఆ ఆసక్తి కాస్తా మరింత పెరిగి చివరికి సాధ్వి జీవితాన్ని స్వీకరించాలనే బలమైన నిర్ణయాన్ని తీసుకునేందుకు దారితీసిందని ఆమె తెలిపింది.
సాధారణంగా చదువు పూర్తి అయిన తర్వాత మంచి ఉద్యోగం, బిజినెస్, ఆర్థికంగా పటిష్ఠంగా మారడం, లగ్జరీ లైఫ్ కోసం చాలామంది యువత ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ సంజనా మాత్రం వారందరి కంటే భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. కోట్ల రూపాయల ఆస్తులు, ఆధునిక సౌకర్యాలు ఉన్నప్పటికీ తాను కోరుకునే మానసిక ప్రశాంతత, ఆనందం వాటిలో లభించడం లేదని ఆమె గుర్తించింది. భౌతిక సుఖాల కంటే జైన ధర్మానికి అంకితమైన జీవితంలోనే నిజమైన శాంతి లభిస్తుందని తాను నమ్ముతున్నట్లు సంజన తెలిపింది. ఈ క్రమంలో జైన సంప్రదాయంలోని భగవతి దీక్ష స్వీకరించి సాధ్విగా మారాలనే బలమైన నిర్ణయాన్ని తీసుకుంది.