హైదరాబాద్‌లో వాడుకున్న నీరు కూడా వృథానే.. శుద్ధి చేసిన నీటిలో 96.5 శాతం వృథా, రీసైక్లింగ్‌ 3.5 శాతమే!

RVIRVI
19 Nov, 26
 0  11
హైదరాబాద్‌లో వాడుకున్న నీరు కూడా వృథానే.. శుద్ధి చేసిన నీటిలో 96.5 శాతం వృథా, రీసైక్లింగ్‌ 3.5 శాతమే!

ఓవైపు పెరుగుతున్న నీటి అవసరాలతో హైదరాబాద్‌ నగరం తీవ్రంగా సతమతం అవుతోంది. తాగునీటి అవసరాల కోసం ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు నగరంలో శుద్ధి చేస్తున్న మురుగునీటిని తిరిగి వినియోగించుకోవడంలో మాత్రం ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదు. శుద్ధి చేసిన నీటిలో కేవలం 3.5 శాతాన్ని మాత్రమే తిరిగి ఉపయోగిస్తున్నట్లు 2025లో ప్రచురితమైన ఓ అధ్యయనం వెల్లడించడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తోంది. నీటి కొరతను ఎదుర్కొంటున్న నగరంలో అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ వనరును సద్వినియోగం చేసుకోవడం లేదనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

‘Wastewater Management and Reuse in Hyderabad, India: Comparison of the related regulations between Japan and India’ పేరుతో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. హైదరాబాద్‌లో రోజుకు 772 మిలియన్‌ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేస్తుండగా.. అందులో కేవలం 27 ఎంఎల్‌డీ నీటినే తిరిగి వినియోగిస్తున్నారని వెల్లడైంది. అంటే మొత్తం శుద్ధి చేసిన నీటిలో రీసైక్లింగ్‌ వాటా కేవలం 3.5 శాతమే కావడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ సర్వీస్‌ లెవల్‌ బెంచ్‌మార్కింగ్‌ మార్గదర్శకాల్లో సూచించిన 20 శాతం రీసైక్లింగ్‌ లక్ష్యంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. శుద్ధి చేసిన నీటిని తిరిగి వినియోగించుకోవడం ద్వారా ఉపరితల, భూగర్భ జల వనరులపై ఒత్తిడిని గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



ముఖ్యంగా వర్షాలు తక్కువగా కురిసే సంవత్సరాల్లో చెరువులు, ఇతర జలాశయాలను నింపేందుకు ఈ నీటిని ఉపయోగిస్తే భూగర్భ జలమట్టాలు పెరిగే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. శుద్ధి చేసిన మురుగునీటిని తాగడానికి కాకుండా ఉపయోగించే అవసరాల కోసం విస్తృతంగా వినియోగించాలని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ)లోని ఇంటర్‌డిసిప్లినరీ సెంటర్‌ ఫర్‌ వాటర్‌ రీసెర్చ్‌ ప్రొఫెసర్‌ శేఖర్‌ ముద్దు సూచించారు. వాహనాల శుభ్రత, తోటల పెంపకం, నిర్మాణ రంగం, పరిశ్రమలు, పట్టణంలోని పచ్చదనం నిర్వహణ వంటి అవసరాలకు ఈ నీటిని మళ్లించవచ్చని తెలిపారు. బెంగళూరులో శుద్ధి చేసిన మురుగునీటిని చెరువుల పునరుజ్జీవనానికి వినియోగిస్తున్న తరహాలో హైదరాబాద్‌లోనూ చర్యలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లై అండ్‌ సీవరేజ్‌ బోర్డు (హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ) వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం శుద్ధి చేసిన మురుగునీటిలో సుమారు 2 శాతమే తిరిగి వినియోగిస్తున్నారు. 2025లో 700 ఎంఎల్‌డీకి పైగా ఉన్న శుద్ధి సామర్థ్యాన్ని ఈ ఏడాది సుమారు 1,400 ఎంఎల్‌డీకి పెంచినప్పటికీ.. ప్రస్తుతం రీసైక్లింగ్‌ అవుతున్న నీటి పరిమాణం సుమారు 30 ఎంఎల్‌డీ మాత్రమేనని గణాంకాలు చెబుతున్నాయి. రాబోయే 18 నెలల్లో 20 శాతం రీసైక్లింగ్‌ లక్ష్యాన్ని చేరుకోవాలని జలమండలి ప్రణాళిక రూపొందించింది.