బోనాల నాటికి ఇందిరమ్మ ఇళ్లలోకి పేదలు.. క్యూర్ పరిధిలో నిర్మాణాలపై మంత్రి కీలక ప్రకటన

RVIRVI
04 Nov, 26
 0  21
బోనాల నాటికి ఇందిరమ్మ ఇళ్లలోకి పేదలు.. క్యూర్ పరిధిలో నిర్మాణాలపై మంత్రి కీలక ప్రకటన

హైదరాబాద్ క్యూర్‌ పరిధిలోని గోషామహల్‌, చాంద్రాయణగుట్ట, ముషీరాబాద్‌, ఎల్‌.బి.నగర్‌ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల ఫ్లాట్ల కేటాయింపునకు మంగళవారం ఈ-లాటరీ నిర్వహించారు. గతంలో రద్దయిన కేటాయింపులతో ఏర్పడిన ఖాళీలను అర్హులతో భర్తీ చేస్తున్నారు. చిరునామాల జియోకోడింగ్‌ ఆధారంగా నియోజకవర్గాలను గుర్తించి మాప్‌అప్‌ లాటరీ చేపట్టారు. వచ్చే బోనాల నాటికి పేదలకు సొంతింటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం వెల్లడించారు.గ్రేటర్‌ హైదరాబాద్‌ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (క్యూర్‌) పరిధిలోని పేదలకు ఉపాధి అవకాశాలు దూరం కాకుండా, వారు ప్రస్తుతం నివసిస్తున్న నియోజకవర్గంలోనే సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. వచ్చే బోనాల పండుగ నాటికి పేదలు తమ సొంతింట్లోనే వేడుకలు జరుపుకోవాలనే లక్ష్యంతో నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో పేదలకు గృహవసతి కల్పించడంతోపాటు వారి జీవనోపాధికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు.



మంగళవారం నాంపల్లిలోని రాష్ట్ర హౌసింగ్‌ బోర్డు కార్యాలయ సమావేశ మందిరంలో గోషామహల్‌, చాంద్రాయణగుట్ట, ముషీరాబాద్‌, ఎల్‌.బి.నగర్‌ నియోజకవర్గాల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ఈ-లాటరీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తోపాటు గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌, హౌసింగ్‌ బోర్డు మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీపీ గౌతమ్‌ పాల్గొన్నారు. నాలుగు నియోజకవర్గాల్లో ప్రతిపాదించిన ఇందిరమ్మ టవర్స్‌లో మిగిలిన ఫ్లాట్లను అర్హులకు కేటాయించేందుకు మాప్‌అప్‌ లాటరీ ప్రక్రియ చేపట్టారు.

గతంలో ఓఆర్‌ఆర్‌ పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన లాటరీ ద్వారా ఎంపికైన కొందరి కేటాయింపులు వివిధ కారణాలతో రద్దయ్యాయి. లబ్ధిదారులు సంబంధిత నియోజకవర్గాల్లో నివసించకపోవడం, ప్రభుత్వం నిర్ణయించిన మొత్తాన్ని చెల్లించలేమని చెప్పడం, ఇప్పటికే సొంత ఇళ్లు ఉండటం వంటి కారణాలతో కొన్ని ఫ్లాట్లు ఖాళీ అయ్యాయని హౌసింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌ వీపీ గౌతమ్‌ తెలిపారు. ఈ ఖాళీలను గతంలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి తిరిగి కేటాయిస్తున్నట్లు వివరించారు.