హైదరాబాద్‌లో నీటి సంక్షోభం.. జనవరి నుంచి 3.5 లక్షల కనెక్షన్లకు నీరు కట్.. ఐటీ కారిడార్‌కు షాక్!

RVIRVI
13 Nov, 26
 0  25
హైదరాబాద్‌లో నీటి సంక్షోభం.. జనవరి నుంచి 3.5 లక్షల కనెక్షన్లకు నీరు కట్.. ఐటీ కారిడార్‌కు షాక్!

ఎల్‌నినో దెబ్బకు హైదరాబాద్‌లోని సైబరాబాద్ ఐటీ కారిడార్‌కు త్వరలో నీటి కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటిమట్టాలు గణనీయంగా పడిపోవడంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ) కీలక నిర్ణయానికి రెడీ అవుతోంది. ఈ రెండు రిజర్వాయర్ల నుంచి ప్రస్తుతం అందుతున్న నీటి సరఫరాను భారీగా తగ్గించాలని భావిస్తోంది. జనవరి నుంచి సరఫరా 120 ఎంజీడీల (రోజుకు మిలియన్ గ్యాలన్స్) నుంచి కేవలం 20 ఎంజీడీలకు తగ్గితే సైబరాబాద్ పరిధిలోని 3.5 లక్షలకు పైగా గృహ, వాణిజ్య నీటి కనెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉందనే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ ప్రాంతాలపై తీవ్ర ప్రభావం!

ముఖ్యంగా ఐటీ హబ్‌గా పేరొందిన శేరిలింగంపల్లి నియోజకవర్గంతో పాటు గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, నానక్‌రామ్‌గూడ, లింగంపల్లి, చందానగర్, మియాపూర్, మదీనాగూడ, బీరంగూడ, రామచంద్రాపురం, పటాన్‌చెరు ప్రాంతాల్లో నీటి సరఫరా సమస్యలు తలెత్తవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, ప్రగతినగర్, మూసాపేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, షేక్‌పేట ప్రాంతాలపైనా ప్రభావం ఉండొచ్చని చెబుతున్నారు.


ట్యాంకర్లకు డిమాండ్.. భారీగా భారం!

నీటి సరఫరా తగ్గితే అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు ప్రైవేట్ ట్యాంకర్లే దిక్కు కానున్నాయి. ఇప్పటికే పలు హైరైజ్ భవనాల్లో నీటిని పొదుపు చేసేందుకు స్విమ్మింగ్ పూల్స్, ఫౌంటెన్లను మూసివేస్తున్నారు. గార్డెన్లకు నీటి సరఫరాను నిలిపివేస్తున్నారు. ప్రైవేట్ ట్యాంకర్ల కోసం వారానికి రూ.లక్షల ఖర్చు చేయాల్సి వస్తుండటంతో నివాసితులపై నిర్వహణ భారం పెరుగుతోంది. ట్యాంకర్ల ధరలు పెరగడంతో పాటు బుకింగ్ చేసినా రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి రావచ్చనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఐటీ కంపెనీలకూ తప్పని తిప్పలు?

సైబరాబాద్‌లోని భారీ ఐటీ భవనాల్లో సెంట్రల్ ఏసీ వ్యవస్థల నిర్వహణకు కూడా పెద్ద మొత్తంలో నీరు అవసరం అవుతుంది. నీటి కొరత తీవ్రమైతే కూలింగ్ వ్యవస్థల నిర్వహణ కష్టతరం అవుతుంది. దీంతో కొన్ని ఐటీ సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. హైబ్రిడ్ విధానాన్ని అమలు చేసే అవకాశాలనూ పరిశీలించవచ్చనే చర్చ జరుగుతోంది.

42 రోజుల నీటి నిల్వలే.. ప్రత్యామ్నాయాలపై దృష్టి!

మరోవైపు.. సింగూరు, మంజీరా జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీరు మరో 42 రోజులకు మాత్రమే సరిపోవచ్చనే అంచనాలు ఇప్పుడు నగరవాసుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోదావరి జలాలను హైదరాబాద్‌కు మళ్లించడంతోపాటు.. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నుంచి అదనపు నీటిని వినియోగించే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే ప్రత్యామ్నాయ నీటి సరఫరాపై పూర్తి స్థాయి కార్యాచరణ ఇంకా వెల్లడించాల్సి ఉంది. జనవరి నుంచి నీటి కోతలు అమలైతే సైబరాబాద్ ప్రజలకు గడ్డుకాలం తప్పకపోవచ్చనే ఆందోళన వ్యక్తం అవుతున్నాయి.