సంక్షేమ పథకాలతో తెలుగు రాష్ట్రాలపై ఆర్థిక భారం.. నగదు బదిలీలో దేశంలోనే తెలంగాణ టాప్-2, ఏపీ టాప్-4

RVIRVI
18 Nov, 26
 0  14
సంక్షేమ పథకాలతో తెలుగు రాష్ట్రాలపై ఆర్థిక భారం.. నగదు బదిలీలో దేశంలోనే తెలంగాణ టాప్-2, ఏపీ టాప్-4

సంక్షేమ పథకాల కింద ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేసే విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు దేశంలోనే టాప్‌లో ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రాలు తమ రెవెన్యూ వ్యయంలో నగదు బదిలీ పథకాల కోసం కేటాయించిన నిధుల వాటా ఆధారంగా రూపొందించిన నివేదికలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 15 శాతం కేటాయింపులతో జార్ఖండ్ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా.. 14 శాతంతో తెలంగాణ, పశ్చిమ బెంగాల్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక 13 శాతం కేటాయింపులతో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది.

2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన 128 నగదు బదిలీ పథకాల కోసం రూ.32,629 కోట్లు కేటాయించింది. ఈ మొత్తం రాష్ట్ర రెవెన్యూ రాబడుల్లో 14 శాతానికి సమానం. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదే తరహా పథకాల కోసం రూ.33,943 కోట్లు కేటాయించింది. ఇది ఆ రాష్ట్ర రెవెన్యూ రాబడుల్లో 13 శాతంగా ఉంది. తెలంగాణ కేటాయింపుల్లో రైతుల కోసం రూ.18 వేల కోట్లు.. సామాజిక భద్రతా పింఛన్ల కోసం రూ.14,629 కోట్లు ఉన్నాయి. ఏపీలో సామాజిక భద్రతా పింఛన్లకు రూ.27,343 కోట్లు.. రైతులకు ఆర్థిక సాయం అందించే పథకాల కోసం రూ.6,600 కోట్లు కేటాయించారు.



నగదు బదిలీ పథకాల కోసం అత్యధికంగా పశ్చిమ బెంగాల్ రూ.47,542 కోట్లు కేటాయించింది. ఆ తర్వాత కర్ణాటక రూ.40,392 కోట్లు, మహారాష్ట్ర రూ.38,549 కోట్లతో ఉన్నాయి. మధ్యప్రదేశ్ రూ.32,059 కోట్లు, తమిళనాడు రూ.19,036 కోట్లు కేటాయించాయి. రెవెన్యూ వ్యయంలో నగదు బదిలీ పథకాలకు కేటాయించిన వాటా రాష్ట్రాలవారీగా చూస్తే.. జార్ఖండ్ 15 శాతం, తెలంగాణ 14 శాతం, పశ్చిమ బెంగాల్ 14 శాతం, ఆంధ్రప్రదేశ్ 13 శాతం, కర్ణాటక 12 శాతం, మధ్యప్రదేశ్ 10 శాతం, మహారాష్ట్ర 6 శాతంగా ఉన్నాయి.