కొండగట్టు అంజన్న నిజ రూప దర్శనం.. మహా క్రతువుకు ఏర్పాట్లు, ఏ రోజు నుంచంటే..?
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో అరుదైన ఆధ్యాత్మిక ఘట్టానికి రంగం సిద్ధమైంది. దాదాపు 60 ఏళ్ల తర్వాత స్వామివారి మూలవిరాట్‌పై పేరుకుపోయిన చందనాన్ని శాస్త్రోక్తంగా తొలగించి నిజరూప దర్శనానికి భక్తులకు అవకాశం కల్పించనున్నారు. ఈ చారిత్రక వేడుకను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు, అర్చకులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. సుమారు 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం గత 35 ఏళ్లలో గణనీయంగా అభివృద్ధి చెందింది. అయితే స్వామివారి మూలవిరాట్ అసలు రూపాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం ఈతరం భక్తులకు, అర్చకుల్లో చాలామందికి కూడా దక్కలేదు.
గతంలో ప్రతి శనివారం గర్భగుడిలోని స్వామివారి మూలవిరాట్‌కు చందనం పూసి అలంకరించేవారు. కాలక్రమంలో ఈ చందనం పొర మందంగా పేరుకుపోయింది. 1965లో చివరిసారిగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి చందనాన్ని తొలగించారు. అప్పట్లో తొలిసారిగా స్వామివారి నిజరూపాన్ని దర్శించుకున్న అర్చకులు.. ఆ ఆకారాన్ని చిత్రకారుడితో చిత్రంగా గీయించారు. ప్రస్తుతం స్వామివారి అసలు రూపానికి సంబంధించి అందుబాటులో ఉన్న ప్రధాన ఆధారం ఆ చిత్రమే. ఇద్దరు ముగ్గురు సీనియర్ విశ్రాంత అర్చకులకు మినహా ప్రస్తుత తరానికి చెందినవారిలో చాలామందికి స్వామివారి నిజరూపం గురించి ప్రత్యక్ష అనుభవం లేదు.
ఈ నెల 15న చందనోత్సవాలకు శ్రీకారం చుట్టనుండగా.. 16 నుంచి 20వ తేదీ వరకు ఐదు రోజుల పాటు చందనం తొలగింపు ప్రక్రియ నిర్వహించనున్నారు. ఇందుకోసం పంచలోహాలతో ప్రత్యేకంగా తయారు చేయించిన రెండు సరాతాలకు బంగారు, వెండి తాపడం చేయించారు. దేవతా వృక్షాలుగా భావించే మామిడి, జువ్వి, మర్రి, రావి, మేడి చెట్ల కలపతో రూపొందించిన పనిముట్లను కూడా ఈ పవిత్ర కార్యక్రమంలో ఉపయోగించనున్నారు.