అదే నిజమైతే సీఎంగా రేవంత్ ఒక్క క్షణం కూడా పదవిలో ఉండడానికి అర్హుడు కాదు: కవిత

RVIRVI
18 Nov, 26
 0  12
అదే నిజమైతే సీఎంగా రేవంత్ ఒక్క క్షణం కూడా పదవిలో ఉండడానికి అర్హుడు కాదు: కవిత

నాగార్జున సాగర్‌ జలాశయం నుంచి నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపడుతున్నట్లు వెల్లడైన భారీ టన్నెల్‌ ప్రాజెక్టుపై తెలంగాణ రాజకీయాల్లో చర్చ మొదలైంది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని టీఆర్ఎస్‌ అధినేత్రి కవిత ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనుమతితోనే ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పనులు చేపడుతోందా? అని నిలదీశారు. ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వానికి కనీస సమాచారం లేదా అని ప్రశ్నించారు. ఒకవేళ సమాచారం లేకపోతే రాష్ట్ర నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు.



నాగార్జున సాగర్‌ నుంచి నీటిని తరలించే ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం లేదంటే ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి ఒక్క క్షణం కూడా పదవిలో ఉండటానికి అర్హుడు కాదంటూ కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై వెంటనే ప్రభుత్వం స్పందించాలని, అనుమతులు లేకుండా ఏపీ చేపట్టిన ప్రాజెక్టు పనులను నిలిపివేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆమె ట్విట్టర్ ఎక్స్‌ వేదికగా డిమాండ్‌ చేశారు.కాగా, విజయపురి సౌత్‌ ప్రాంతంలో నాగార్జున సాగర్‌ డ్యామ్‌ కుడివైపు అమరజీవి జలపథకం పేరుతో ఏపీ ప్రభుత్వం భారీ సొరంగం నిర్మిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా జలాశయంలో నీటిమట్టం 510 అడుగుల స్థాయికి పడిపోయినప్పటికీ గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశం ఉంటుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాగునీటి అవసరాల పేరుతో చేపడుతున్న ఈ పథకం ద్వారా సాగునీటి అవసరాలకూ నీటిని మళ్లించే ప్రమాదం ఉందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రాజెక్టు తొలి దశకు సుమారు రూ.1200 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు నీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా ఈ పథకాన్ని చేపట్టినట్లు తెలుస్తోంది. రోజుకు 160 మిలియన్‌ లీటర్ల సామర్థ్యంతో నీటి శుద్ధి ప్లాంట్‌, ఇన్‌టేక్‌ వెల్‌, బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లకు నీటిని తరలించే వ్యవస్థ ఇందులో భాగంగా ఉన్నట్లు సమాచారు. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా మౌనంగా ఉందన్న విమర్శకు సంబంధించి మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు ఈ ప్రాజెక్టును అక్రమంగా చేపడుతున్నారని పేర్కొంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని కోరటంతో పాటు సుమారు 1.865 టీఎంసీల నీటిని తరలించేలా ఈ పథకాన్ని రూపొందించారని తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కవిత చేసిన రాజకీయ విమర్శలు, ప్రభుత్వం తీసుకుంటున్న అధికారిక చర్యలు చర్చనీయాంశంగా మారాయి.