గడిపెద్దాపూర్లో భారీ అగ్నిప్రమాదం.. క్షణాల్లో కాలిపోయిన ఫ్యామిలీ రెస్టారెంట్!
అల్లాదుర్గం: మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ శివారులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 161వ జాతీయ రహదారి పక్కన ఉన్న ‘ది ఫామ్ సైడ్ ఫ్యామిలీ రెస్టారెంట్’ (దాబా)లో సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెస్టారెంట్లోని సామగ్రి పూర్తిగా కాలిపోయి సుమారు రూ.3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
చెత్తకు నిప్పు పెట్టడంతో ప్రమాదం
దాబా పక్కన చెత్తను తగులబెడుతుండగా, తీవ్ర గాలుల కారణంగా నిప్పురవ్వలు ఎగిరి రెస్టారెంట్లోని గుడిసెలపై పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బలమైన గాలులకు మంటలు వేగంగా వ్యాపించి క్షణాల్లోనే రెస్టారెంట్ మొత్తం దగ్ధమైంది.
మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది
ప్రమాదంపై సమాచారం అందుకున్న జోగిపేట అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే, అప్పటికే రెస్టారెంట్లోని గుడిసెలు, సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంతో నిర్వాహకులకు సుమారు రూ.3 లక్షల నష్టం వాటిల్లినట్లు సమాచారం.