చిరంజీవి ‘కాకా’ వస్తున్నాడు.. అసలైన పండగ తెస్తున్నాడు: రూమర్లకు చెక్ పెట్టిన కోన వెంకట్

RVIRVI
06 Nov, 26
 0  21
చిరంజీవి ‘కాకా’ వస్తున్నాడు.. అసలైన పండగ తెస్తున్నాడు: రూమర్లకు చెక్ పెట్టిన కోన వెంకట్

చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘కాకా’. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ చిత్రం రూపొందుతోంది. 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలనే టార్గెట్ పెట్టుకొని, షూటింగ్ చేస్తున్నారు. ఓవైపు చిత్రీకరణ పూర్తి చేస్తూనే, మరోవైపు ప్యారలల్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా వాయిదా పడనుందనే రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటికి రచయిత కోన వెంకట్ తాజాగా చెక్ పెట్టారు.

‘కాకా’ సినిమాని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు షూటింగ్ ప్రారంభించినప్పుడే ప్రకటించారు. ఆ తర్వాత జనవరి 13వ తేదీని లాక్ చేశారు. కానీ చిరంజీవి - డైరెక్టర్ వశిష్ఠ కాంబోలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ సినిమా రెడీ అవ్వడంతో, ఈ సినిమానే ముందుగా థియేటర్లలోకి తీసుకొస్తారనే ప్రచారం మొదలైంది. ఓటీటీ డీల్ ప్రకారం సంక్రాంతికి రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘కాకా’ పోస్ట్ పోన్ అవుతుందని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు కోన వెంకట్ మాత్రం చెప్పిన సమయానికే సినిమా వస్తుందని ప్రకటించారు.



“కాకా’ గురించి వస్తున్న అన్ని రూమర్స్, అన్ని ఫేక్ న్యూస్, అన్ని నిరాధార కథనాలకు మరోసారి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని నిరుత్సాహపరిచినందుకు క్షమించండి కానీ మేము జనవరి 13న ల్యాండ్ అవుతున్నాము. సంక్రాంతికి ‘కాకా’ వస్తున్నాడు.. అసలైన పండగ తెస్తున్నాడు” అని కోన వెంకట్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. దీనికి డైరెక్టర్ బాబీ, కేవీఎన్ ప్రొడక్షన్స్ లను ట్యాగ్ చేశారు. అలానే చిరంజీవితో కలిసి ఉన్న ఫొటోని పంచుకున్నారు.