జీవితంలో అత్యంత ఘోరమైన సమయంలో అండగా నిలిచింది అతనే: జాన్వీ కపూర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ తన వ్యక్తిగత జీవితం గురించి, ముఖ్యంగా శిఖర్ పహారియాతో ఉన్న అనుబంధం గురించి ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన జీవితంలో ఎదురైన అత్యంత కష్టసమయంలో శిఖర్ తనను ఏ విధంగా సపోర్ట్ చేశాడో గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది. 2018లో తల్లి, అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణం చెందినప్పుడు తాము ఎదుర్కొన్న దారుణమైన పరిస్థితులను ఈ వేదికపై పంచుకుంది. లండన్లో చదువుకుంటున్న శిఖర్ పహారియా తన చదువును అర్ధాంతరంగా ఆపేసి ముంబైకి వచ్చేశాడని వెల్లడించింది. తనకు ఎప్పుడు ఏ అవసరం వస్తుందో, తాను ఎక్కడ ఒంటరైపోతానో అని భయపడి జుహులోని తన స్నేహితుడి ఇంట్లోనే నెల రోజుల పాటు రహస్యంగా ఉన్నాడనే విషయం తనకు చాలా కాలం తర్వాత తెలిసిందని చెబుతూ ఎమోషనల్ అయ్యింది.తల్లిని కోల్పోయిన ఆ ఘోరమైన సమయంలో చెల్లెలు ఖుషీ కపూర్ తన ఏడుపును ఆపేసి తనకు ధైర్యం చెప్పిన తీరును కూడా జాన్వీ ‘కాఫీ విత్ కరణ్’ షోలో గుర్తు చేసుకుంది. శిఖర్ పహారియా, జాన్వీ కపూర్ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నప్పటికీ తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అయితే చాలా ఇంటర్వ్యూలలో తన జీవితంలో శిఖర్ పాత్ర ఎంత ముఖ్యమైందో ఆమె చెబుతూనే వస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే, జాన్వీ ఇటీవల రామ్ చరణ్ సరసన 'పెద్ది' సినిమాలో నటించి అలరించగా, తదుపరి టైగర్ ష్రాఫ్, లక్ష్యలతో కలిసి 'లగ్ జా గలే' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా 2027 మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.