డిజిటల్ స్కాంలపై సుప్రీం సీరియస్!
న్యూఢిల్లీ, డిజిటల్ అరెస్టు పేరుతో ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్న సైబర్ నేరగాళ్ల మోసాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి మోసాల వల్ల డబ్బు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించే విషయంలో బ్యాంకులను బాధ్యులుగా చేయాల్సిన అవసరం ఉందని సూచించింది. ఖాతాదారులు మోసపోకుండా చూడటంలో బ్యాంకులు రక్షణ కవచంలా పనిచేయాలని పేర్కొంది.
సాధారణంగా ఒక వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి కొంత డబ్బు తీసుకోవడం సహజం. కానీ, ముఖ్యంగా వృద్ధులు లేదా పదవీ విరమణ చేసిన ఉద్యోగుల ఖాతాల నుంచి ఒక్కసారిగా భారీ మొత్తంలో డబ్బు బదిలీ అయితే బ్యాంకులు అప్రమత్తం కావాలి. అలాంటి లావాదేవీలను గుర్తించి, ఖాతాదారులను హెచ్చరించి, డబ్బు పోకుండా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాయని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేసినట్లు ‘బార్ అండ్ బెంచ్’ నివేదించింది.
డిజిటల్ అరెస్టు మోసాల్లో సైబర్ నేరగాళ్లు పోలీసులమని, దర్యాప్తు సంస్థల అధికారులమని చెప్పుకుంటారు. బాధితులు ఏదో నేరం చేశారని ఆరోపిస్తూ, అరెస్టు చేస్తామని బెదిరిస్తారు. భయపడిన బాధితులు తమను తాము రక్షించుకోవాలనే ఆందోళనతో నేరగాళ్లు చెప్పినట్లు బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు బదిలీ చేస్తారు.
నిజానికి, ఫోన్ లేదా వీడియో కాల్లో అరెస్టు చేస్తామని బెదిరించి డబ్బులు అడగడం మోసానికి సంకేతం కావచ్చు. ఇలాంటి సమయంలో ప్రజలు భయపడి డబ్బులు పంపకుండా, సంబంధిత అధికారిక మార్గాల ద్వారా విషయాన్ని నిర్ధారించుకోవాలి. అనుమానాస్పదంగా పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ అవుతున్నప్పుడు బ్యాంకులు కూడా వెంటనే స్పందించి ఖాతాదారులను అప్రమత్తం చేయాలని కోర్టు వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.
మోసాలను అడ్డుకునేందుకు చర్యలు
సుప్రీంకోర్టు ఈ అంశంపై స్వయంగా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి స్పందిస్తూ.. అనుమానాస్పద లావాదేవీలను గుర్తించే సామర్థ్యాన్ని బ్యాంకులు మెరుగుపరుచుకుంటున్నాయని తెలిపారు. ఇలాంటి మోసాలను అడ్డుకునేందుకు పలు చర్యలు కూడా తీసుకుంటున్నట్లు వివరించారు. అయినప్పటికీ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నా డిజిటల్ అరెస్టు మోసాలు కొనసాగుతుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మోసాలను అరికట్టేందుకు రాష్ట్ర పోలీసు బలగాల నుంచి నివేదికలు, సూచనలు అందించాలని కోరింది.