తీన్మార్‌ మల్లన్న కాన్వాయ్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు

RVIRVI
13 Nov, 26
 0  29
తీన్మార్‌ మల్లన్న కాన్వాయ్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు

తుంగతుర్తి : ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న (Teenmar Mallanna) కాన్వాయ్‌లో వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటన యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురం వద్ద చోటుచేసుకుంది. మోత్కూరు నుంచి అనాజిపురం మీదుగా తిరుమలగిరి వైపు మల్లన్న పాదయాత్ర సాగుతున్న క్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఆయన కాన్వాయ్‌లోని కారును బలంగా ఢీకొట్టడంతో.. ఆ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎదురుగా వస్తున్న కారులోని  నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 

గాయపడిన వారిని తిరుమలగిరికి చెందిన మేడబోయిన శ్రీనాథ్‌, ఆయన భార్య చందన, రెండేళ్ల కుమారుడితో పాటు డ్రైవర్‌ సురేశ్‌గా గుర్తించారు. క్షతగాత్రులను 108 వాహనంలో నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. భార్యభర్తల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తీన్మార్‌ మల్లన్న కారులో ఉన్న ఇద్దరికి కూడా గాయాలైనట్లు తెలిసింది. ప్రమాద తీవ్రతకు మల్లన్న కారు పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో ఆయన కారులో లేకపోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.