తెలంగాణలో బీజేపీ అసలైన ఆట మొదలైంది..

RVIRVI
21 Nov, 26
 0  11
తెలంగాణలో బీజేపీ అసలైన ఆట మొదలైంది..

తెలంగాణ సీఎం ఏ రేవంత్ రెడ్డిపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సిద్ధిపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కిషన్ రెడ్డి.. తెలంగాణ రాజకీయాల్లో ఇకపై బీజేపీ అసలైన ఆట ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలు రాజకీయ మార్పును బలంగా కోరుకుంటున్నారని, దానిని నిజం చేసే సత్తా ఒక్క తమ పార్టీకి మాత్రమే ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల సంక్షేమ కోసం బీజేపీ కృషి చేస్తుందని చెప్పారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు.. నిలువునా దోపిడి చేశాయని ఆరోపించారు.

శుక్రవారం ఢిల్లీలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... "రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాతే తెలంగాణలో బీజేపీ ఏకంగా 8 ఎంపీ సీట్లను దక్కించుకుంది. అంతేకాదు, ఇటీవల ఎన్నికలు జరిగిన రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ బీజేపీ జెండా ఎగిరింది. త్వరలో జరగనున్న మరో రెండు ఎమ్మెల్సీ స్థానాలు తమ ఖాతాలోకే చేరడం ఖాయం’’ అని కేంద్ర మంత్రి జోస్యం చెప్పారు. తెలంగాణ, కర్ణాటకతో పాటు హిమాచల్ ప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ పార్టీ ఓటమి తప్పదని ఆయన అన్నారు.



కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందేనని, వారిపై ప్రజల్లో తీవ్ర అసహనం గూడుకట్టుకుందని పేర్కొన్నారు. ఆ పార్టీలను తెలంగాణ ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తున్నారని, రాబోయే రోజుల్లో వాటికి ఓటు వేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, తమ ఆకాంక్షల సాకారం మోదీ నాయకత్వంలోని బీజేపీతోనే సాధ్యమని ప్రజలు బలంగా నమ్మతున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కమలం వికాసం తథ్యమని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు