తెలంగాణ నీటి హక్కులపై రాజీ పడుతున్నారా..? సీఎం రేవంత్ వైఖరిపై కవిత విమర్శలు
పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం భిన్నమైన వైఖరిని అనుసరిస్తోందని తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. నదీ జలాల వినియోగం, గోదావరి జలాల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేదని ఆరోపించారు. నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (NWDA) సమావేశాల్లో రాష్ట్ర అధికారులు ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశంలో పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సమ్మతి తెలిపారని గుర్తు చేసారు. ఈ రెండు వైఖరులు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని అన్నారు.
ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశాల్లో అధికారులు పాల్గొని గోదావరి–కావేరి నదుల అనుసంధానాన్ని సమ్మక్క సాగర్ తుపాకులగూడెం నుంచి చేపట్టాలని కోరుతున్నారని కవిత వివరించారు. అయితే అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు అంగీకారం తెలిపినట్లు ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన కీలకమైన అంశంపై ప్రభుత్వం ఒకే విధానంతో ముందుకు వెళ్లడం లేదని విమర్శించారు.
ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు రావాల్సిన గోదావరి జలాల వినియోగంపై ప్రభావం పడే ప్రమాదం ఉందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. 2024లోనే తెలంగాణ జాగృతి తరఫున ఈ అంశంపై స్పందించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్టును అడ్డుకోవాలని డిమాండ్ చేసినట్లు గుర్తుచేశారు. తెలంగాణకు హక్కుగా దక్కాల్సిన 250 టీఎంసీల గోదావరి జలాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణగా సమర్పిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి నిర్వహించిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలోనూ రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుకు అంగీకారం తెలిపారని కవిత ఆరోపించారు. సమావేశం అనంతరం మీడియా ముందు మాత్రం ఇందుకు భిన్నంగా మాట్లాడారని విమర్శించారు. ముఖ్యమంత్రి సమ్మతితోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నదుల అనుసంధానంలో భాగంగా పోలవరం–బనకచర్ల ప్రాజెక్టును చేపట్టేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తోందని ఆమె పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలపై ప్రభుత్వం నుంచి వివరణ రావాల్సి ఉంది.