ప్రతికూల ప్రభావం లేకపోతే ఓకే - తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్ర సీఎం సానుకూలం!
తుమ్మిడిహెట్టి వద్ద ఆనకట్ట నిర్మాణానికి సంబంధించిన అంశంపై ముంబయి వేదికగా తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు సమావేశం జరిగింది. తెలంగాణ నీటి అవసరాలు, వెనుకబడిన ప్రాంత అభివృద్ధి, గిరిజనుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో ఆనకట్ట నిర్మాణానికి సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రను కోరారు. తమ రాష్ట్రంపై ప్రతికూల ప్రభావం లేకపోతే తుమ్మిడిహెట్టి వద్ద ఆనకట్ట నిర్మాణానికి గతంలో కుదిరిన ఒప్పందాన్ని పునఃపరిశీలించేందుకు తమకు అభ్యంతరం లేదని, తెలంగాణ నీటి అవసరాలకు సహకరిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు. కేంద్ర జలసంఘం అధ్యయనంతో పాటు రెండు రాష్ట్రాల అధికారులతో కూడిన కమిటీ అన్ని అంశాలను పరిశీలించాలని ప్రతిపాదించారు. ముంపు, ప్రభావిత ప్రాంతానికి సంబంధించి ప్రత్యామ్నాయాలను కూడా అధ్యయనం చేయాలని సూచించారు.
తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో ఆనకట్ట నిర్మాణానికి సంబంధించిన అంశాలపై ముంబైలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్ హౌస్ వేదికగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ బృందం సమావేశమైంది. రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
ఫడణవీస్ హామీ ఇచ్చారు
తుమ్మిడిహెట్టి ఆనకట్ట ఎత్తు పెంపు అంశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో చర్చలు చాలా ఫలవంతంగా ముగిశాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం అనంతరం ఎక్స్ వేదికగా స్పందించిన రేవంత్ రెడ్డి తమ ప్రతిపాదనను పెద్ద హృదయంతో పరిశీలించారని ఫడణవీస్‌కు కృతజ్ఞతలు చెప్పారు. సాంకేతిక అంశాలతో పాటు ముంపు అంశాలపై అధ్యయనం చేసేందుకు అధికారుల కమిటీ ఏర్పాటు చేసేందుకు ఇరువైపులా అంగీకారం కుదిరిందని అన్నారు. మహారాష్ట్ర, అక్కడి ప్రజల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుంటూనే జాతీయ ధృక్పథంతో ఆదిలాబాద్ జిల్లా ప్రజలు, ప్రత్యేకించి గిరిజనుల జీవితాలను మార్చేందుకు తన వంతు సహకరిస్తానని ఫడణవీస్ హామీ ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారని తెలిపారు.