ప్రభాస్ ‘ఫౌజీ’ మూవీ టీజర్ వివాదం.. కేంద్ర మంత్రికి సుభాష్ చంద్రబోస్ మనుమడి ఘాటు లేఖ!
రెబెల్ స్టార్ ప్రభాస్, ఇమాన్వి జంటగా నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘ఫౌజీ’. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి ఇటీవల టీజర్ విడుదల కాగా., ఇందులో భారత స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చరిత్రను తప్పుగా చూపించారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే టీజర్‌ను తొలగించాలని నేతాజీ మనుమడు డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ చిత్రబృందం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. తాజాగా, నేతాజీ మనుమడు చంద్రకుమార్ బోస్ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఘాటుగా లేఖ రాశారు. ఈ టీజర్ నేతాజీ వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి చూపేలా ఉందని, చరిత్రను వక్రీకరించేలా ఉందంటూ చంద్రకుమార్ బోస్ ఆరోపించారు. వెంటనే ఈ టీజర్‌ను యూట్యూబ్, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తొలగించాలని, అలాగే ఈ వివాదాస్పద కంటెంట్‌కు క్లియరెన్స్ ఇచ్చిన సెన్సార్ బోర్డు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘ఫైల్ నంబర్ 25’ అనే టీజర్లో 1942 బెర్లిన్ నేపథ్యంలో నేతాజీ, హిట్లర్‌ను కలిసి ప్రభాస్ పాత్రను పరిచయం చేసినట్లు చూపించారని అన్నారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడే ఓ ఇండియన్ సూపర్ స్పే గురించి నేతాజీ.. హిట్లర్‌తో మాట్లాడినట్లు ఉన్న ఫికోషనల్ సీన్ పైనే చంద్రకుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోదీకి కూడా విజ్ఞప్తి చేసిన ఆయన, చిత్రబృందంపై తమకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని, అయితే దేశ చరిత్ర, మహానాయకుల గౌరవానికే మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. టీజర్‌లోని వివాదాస్పద దృశ్యాలను సరిచేసి మళ్లీ విడుదల చేస్తేనే సినిమాకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. ఈ లేఖతో ప్రభాస్ ‘ఫౌజీ’ టీజర్ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.