మరణంలోనూ.. వీడని బంధం
కలిసి ఏడడుగులు నడిచారు.. కష్టసుఖాలను పంచుకున్నారు..
జీవితాంతం తోడూనీడగా సాగిన ఆ దంపతులను చూసి విధికి కన్నుకుట్టింది.
భర్త ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక మరుసటి రోజే భార్య కన్నుమూశారు.
ఈ విషాద ఘటన వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం పుల్గర్‌చర్లలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చాకలి నిరంజన్ (45) ఈ నెల 29న తెల్లవారుజామున మృతి చెందగా.. సాయంత్రం అంత్యక్రియలు పూర్తి చేశారు. అదే రోజు అర్ధరాత్రి ఆయన భార్య మొగులమ్మ (44) తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కర్నూలుకు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు. తల్లిదండ్రులిద్దరి మరణంతో ఇంజినీరింగ్ చదువుతున్న కుమార్తె కీర్తి, ఇంటర్మీడియట్ చదువుతున్న కుమారుడు శివ దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వృద్ధాప్యంలో ఉన్న నిరంజన్ తల్లి అలివేలమ్మ తన కుమారుడు, కోడలిని కోల్పోయి విషాదంలో మునిగారు. భార్యాభర్తలిద్దరూ కల్వరాల ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు కలిసే చదువుకొని.. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకొన్నారు.