రాత్రి చీకట్లో రెవెన్యూకే షాక్.. సర్కారు బోర్డుకే ఎసరు

RVIRVI
26 Oct, 26
 0  50
రాత్రి చీకట్లో రెవెన్యూకే షాక్.. సర్కారు బోర్డుకే ఎసరు

దిశ, మర్పల్లి : ప్రభుత్వ రికార్డుల్లో సర్కారు భూమిగా ఉన్నా, అధికారులు ప్రత్యేకంగా హెచ్చరిక బోర్డులు నాటినా కొందరు భూబకాసురుల కన్ను మాత్రం మారడం లేదు. సాక్షాత్తు అధికార యంత్రాంగానికే సవాల్ విసురుతూ, ప్రభుత్వ భూమిలోని హెచ్చరిక బోర్డునే రాత్రికి రాత్రే పెకిలించి వేసిన ఘటన మర్పల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మర్పల్లి మండల కేంద్రం పరిధిలోని సర్వే నంబర్ 520లో సుమారు 30 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. విలువైన ఈ స్థలం అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు, ఇతరులు ఎవరూ కబ్జాలకు పాల్పడకుండా చూసేందుకు ఇటీవల రెవెన్యూ అధికారులు అక్కడ అధికారికంగా ‘ఇది ప్రభుత్వ భూమి’ అంటూ హెచ్చరిక బోర్డును పాతారు. అయితే, ఆ భూమి పై కన్నేసిన కొందరు గుర్తుతెలియని అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రి వేళ ఆ బోర్డును వేళ్లతో సహా పెకిలించి మాయం చేశారు. ఉదయాన్నే బోర్డు కనిపించకపోవడంతో స్థానికులు అవాక్కై రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు.బోర్డును తొలగించిన వ్యవహారం పై స్థానిక తహసీల్దార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ బోర్డును తొలగించినంత మాత్రాన భూమి ప్రైవేటు వ్యక్తులది కాబోదని, రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ 30 గుంటల భూమి నూటికి నూరు శాతం ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, సర్కారు బోర్డులను పెకిలించడం చట్టరీత్యా తీవ్రమైన నేరమన్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని గుర్తించేందుకు విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. సర్వే నం. 520లోని ఆ స్థలంలోకి ఎవరైనా అక్రమంగా ప్రవేశించినా, నకిలీ పత్రాలతో క్రయవిక్రయాలు జరిపినా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ హెచ్చరించారు.