‘రామాయణం’ ఎఫెక్ట్.. ఓం రౌత్‌పై మళ్లీ ట్రోలింగ్ షురూ.. ‘ఆదిపురుష్’ను ఆడుకుంటున్న నెటిజన్లు
ఏదైనా పెద్ద సినిమా వచ్చిందంటే, సోషల్ మీడియాలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ను ట్రోల్ చేయడం కామన్ అయిపోయింది. ముఖ్యంగా భారీ వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ తో కూడిన సినిమా రిలీజైందంటే చాలు ఆయన్ని విమర్శించడానికి ఓ బ్యాచ్ రెడీగా ఉంటుంది. ఇప్పుడు ‘రామాయణం’ పార్ట్-1 సినిమా థియేటర్లలో సందడి చేస్తున్న సందర్భంగా, ఓం రౌత్ మరోసారి నెట్టింట ట్రోలింగ్‌కు గురవుతున్నారు.
‘రామాయణ’ సినిమాకి ఓం రౌత్ కు సంబంధం లేదు. కానీ రామాయణం కథతో ఆయనకు సంబంధం ఉంది. ఈ ఇతిహాసం ఆధారంగా దర్శకుడు గతంలో ‘ఆదిపురుష్’ అనే సినిమా తెరకెక్కించారు. ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మైథాలజికల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా మారింది. అంతకంటే దారుణమైన విమర్శలు ఎదుర్కొంది. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో ఓం రౌత్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. అప్పటి నుంచి సందర్భం వచ్చినప్పుడల్లా డార్లింగ్ ఫ్యాన్స్ ఆయన్ను ట్రోల్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ‘రామాయణం’ విడుదల నేపథ్యంలో మరోసారి ఆయన్ను ఆడుకుంటున్నారు.నితీష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా, యశ్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘రామాయణ’. ఇందులో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతమ్మగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటించారు. నవంబర్ 5న రిలీజైన ఈ పౌరాణిక చిత్రానికి మంచి స్పందన వస్తోంది. రివ్యూలన్నీ పాజిటివ్‌గా ఉన్నాయి. విజువల్స్, వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, గ్రాండ్ స్కేల్, ప్రొడక్షన్ వాల్యూస్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ప్రతీ సన్నివేశాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. వీటిని ‘ఆదిపురుష్’ సినిమాతో కంపేర్ చేస్తూ ఓం రౌత్ ను ట్రోల్ చేస్తున్నారు. సెటైర్లు వేస్తున్నారు.