రియల్.. ఈ బాధ ఎవరికీ రావొద్దు!
కొత్తూరు పరిధిలో ఓ లేఅవుట్‌కు డీటీసీపీ అనుమతులు వస్తాయని ఓ రియల్టర్ ప్లాట్లను విక్రయించాడు. ఎల్పీ నంబరు అడిగితే అదిగో ఇదిగో అన్నాడు. అతని మాటలు నమ్మి చాలామంది ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. తీరా అది చెరువు బఫర్ జోన్లోకి రావడంతో ఎల్ఆర్ఎస్కు అనర్హతగా హెచ్ఎండీఏ తేల్చింది.
హైదరాబాద్: రియల్టర్లు, బ్రోకర్ల మాటలు నమ్మి పైసాపైసా కూడబెట్టి అనుమతులు లేని లేఅవుట్లలో ప్లాట్లు కొన్న చాలామంది ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్, ఇతర వివాదాస్పద భూముల్లో కొన్నవాటికి ఎల్ఆర్ఎస్ వర్తించక హెచ్ఎండీఏ చుట్టూ తిరుగుతున్నారు. హెచ్ఎండీఏ ఆరు జోన్లలో ఇప్పటికే ఇలాంటి 2,407 దరఖాస్తులను తిరస్కరించింది. కొన్ని ప్రాంతాల్లో డీటీసీపీ లేఅవుట్లు వేసి విక్రయించిన లేఅవుట్లు సైతం ప్రస్తుతం నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఇప్పుడు అమ్ముదామంటే ఎవరూ ముందుకు రాక పెట్టుబడి పోయి దిగాలు పడుతున్నారు. ఇవేకాక ఎల్ఆర్ఎస్కు అర్హత సాధించిన దరఖాస్తుదారులు కూడా కొన్ని సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ఇవీ ఇబ్బందులు
- 22ఏ జాబితాలోని వక్ఫ్, దేవాదాయ భూముల జాబితాలో ఉన్న ప్లాట్ల దరఖాస్తులు ఎల్1 స్థాయిలోనే ఆగిపోతున్నాయి. ఈ జాబితాలో ఉంటే ఎన్వోసీ పొందడం పెద్ద సమస్యగా మారుతోంది.
- 2020 ఆగస్టు 26 కంటే ముందు రిజిస్టర్ అయిన సేల్‌డీడ్‌తో పాటు సరైన లింక్ డాక్యుమెంట్లు, మార్కెట్ విలువ సర్టిఫికెట్లు, లేఅవుట్ ప్లాన్ సరిగ్గా అప్లోడ్ చేయక షార్ట్‌ఫాల్స్ పెడుతున్నారు.
- 2020లో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసినప్పటికీ మొబైల్ నంబర్లకు షార్ట్‌ఫాల్స్ వెళ్లడం లేదు. దీంతో వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నాయి. ఇప్పటికే ఇలాంటి దరఖాస్తులు 35 వేలు ఉన్నాయి.
- లేఅవుట్లో నిబంధనల ప్రకారం 10 శాతం ఖాళీ స్థలం లేకపోతే, ప్లాట్మార్కెట్ విలువపై అదనంగా 14 శాతం ఛార్జీ విధిస్తున్నారు. ఎల్ఆర్ఎస్ ఫీజు భారీగా పెరిగి, దరఖాస్తుదారులు చెల్లించడానికి వెనుకాడుతున్నారు. 50 వేల దరఖాస్తుల ఫీజు పెండింగ్‌లో ఉంది.
- కొన్ని సందర్భాల్లో ప్లాట్ విస్తీర్ణం, మార్కెట్ విలువను సాఫ్ట్వేర్ తప్పుగా లెక్కించడం వల్ల అధిక నోటీసులు జారీ అయ్యాయి.
- రెవెన్యూ, ఇరిగేషన్, టౌన్‌ప్లానింగ్ ఎల్1, ఎల్2, ఎల్3 విభాగాల మధ్య క్షేత్రస్థాయి తనిఖీల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇలా ఇప్పటికే 15 వేల పైనే దరఖాస్తులు ఆయా దశల్లో ఆగిపోయాయి.