వారం రోజుల కిందటే ఉద్యోగం.. ఇంతలోనే విషాదం..

RVIRVI
21 Nov, 26
 0  11
వారం రోజుల కిందటే ఉద్యోగం.. ఇంతలోనే విషాదం..

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఉన్నత విద్య కోసం వెళ్లిన నల్గొండ జిల్లా మునుగోడుకు చెందిన వీరమళ్ల సాయితేజ (25) చదువు పూర్తికావడంతో ఇటీవలే అక్కడ ఉద్యోగం సాధించాడు. వారం రోజుల కిందటే ఉద్యోగం రావడంతో తల్లిదండ్రులు, ఆనందంలో ఉండగా.. ఇంతలోనే ఊహించని ప్రమాదం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. న్యూయార్క్‌లోని హైవేపై బుధవారం రాత్రి సాయితేజ కారులో ప్రయాణిస్తుండగా.. అకస్మాత్తుగా ఓ జింకు అడ్డుగా వచ్చింది. దీంతో జింకను ఢీకొట్టిన వాహనం రోడ్డుపై నిలిచిపోయింది.

అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన సరకు రవాణా వ్యాన్ ఆ కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయితేజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అదే కారులో ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో అతడ్ని హెలికాప్టర్ ద్వారా పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, ప్రమాదానికి కారణమైన వ్యాన్.. మరో రెండు వాహనాలు ఢీకొట్టడంతో మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.


మునుగోడుకు చెందిన వీరమళ్ల ప్రసాద్, శ్రీకన్య దంపతుల తమ పెద్ద కుమారుడైన సాయితేజను అమెరికాలో పై చదువులకు పంపారు. అక్కడ ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడతాడని ఆశించిన ఆ తల్లిదండ్రులకు.. అతడి మరణవార్త తీరని శోకాన్ని మిగిల్చింది. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సాయితేజ మృతి చెందడంతో మునుగోడులో విషాదఛాయలు అలుముకున్నాయి. తమ కుమారుడి భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు, వారం రోజుల క్రితం కొడుకు ఉద్యోగం సాధించడంతో సంబరపడిపోయారు. కానీ, వారి ఆనందాన్ని చూసి ఆ దేవుడికి అసూయ పుట్టిందేమో రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబలించింది. తమ కుమారుడు ఇక లేడన్న వార్త కన్నీటిని మిగిల్చింది. సాయితేజ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. చేతికి అందొచ్చిన కుమారుడు ఇలా దేశం కాని దేశంలో రోడ్డు ప్రమాదంలో విగతజీవిగా మారడం ఆ కుటుంబం తట్టుకోలేకపోతోంది.