హైదరాబాద్‌లో ఎక్కడా చెత్త కనిపించకూడదు.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

RVIRVI
04 Nov, 26
 0  29
హైదరాబాద్‌లో ఎక్కడా చెత్త కనిపించకూడదు.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

భాగ్యనగరాన్ని పరిశుభ్రతలో దేశానికే ఆదర్శంగా నిలపడంతో పాటు ట్రాఫిక్ కష్టాలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించకూడదని, ప్రతిరోజూ ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ జరగాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు.. నగరంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పరిశుభ్రమైన, ట్రాఫిక్ ఫ్రీ హైదరాబాద్ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

హైదరాబాద్‌లో పారిశుధ్య నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సోమవారం మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణ, పారిశ్రామిక ప్రాంతాల్లో పారిశుధ్యం వంటి అంశాలపై చర్చించారు. నగరంలో ఎక్కడా చెత్త పేరుకుపోకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలని సీఎం ఆదేశించారు. ప్రతిరోజూ ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించేలా పటిష్ఠమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.